కేసులు క్రమంగా తగ్గుతున్నాయ్‌...
logo
Published : 15/06/2021 03:56 IST

కేసులు క్రమంగా తగ్గుతున్నాయ్‌...

పెరుగుతున్న డిశ్ఛార్జ్‌లు

జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే

రెండోదశలో అందరినీ గడగడలాడించిన కొవిడ్‌ వ్యాప్తి జిల్లాలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు డిశ్ఛార్జులు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌, మేలో ఆస్పత్రుల్లో పడకలు దొరకక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్‌ అందుబాటులో లేక అనేకమంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పడకలు అన్నిచోట్లా అందుబాటులో ఉంటున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని అజాగ్రత్త తగదని, అందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మేలోనే ప్రభావం ఎక్కువ..

కరోనా రెండోదశకు సంబంధించి మేలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గత నెల ఒకటో తేదీన 694 పాజిటివ్‌ కేసులు నమోదవగా, అప్పటికి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 62,148 ఉన్నాయి. మే31న కేసుల సంఖ్య 88,622కు చేరింది. అంటే ఒక నెలలో 26,474 మంది ప్రజలు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా 28 నుంచి 45 మధ్య వయస్సు వారే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

మరణాలూ అధికం..

కొవిడ్‌ మొదటి, రెండు దశల్లో కలసి ఈ ఏడాది మేలోనే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ నెలలో 203 మంది వైరస్‌ బారిన పడి మృతిచెందారు. విజయవాడ జీజీహెచ్‌ను రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన తరవాత ఇక్కడికి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కూడా రోగులు చికిత్సకు వస్తున్నారు.

కోలుకుంటున్నారు...

ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో డిశ్ఛార్జి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 24,143 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు.

పది రోజుల నుంచి తగ్గుదల...

జూన్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు 5080 మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. అత్యధికులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 6,610 మంది కొవిడ్‌ బాధితులు వైరస్‌ను జయించారు.

అలసత్వం వద్ధు.

కొవిడ్‌ కేసులు ఇంకా వస్తున్నా.. ప్రజలు మాత్రం కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. పలువురు మాస్కులను ధరించడం లేదు. భౌతిక దూరం అనే మాటను మరిచారు. పలు వస్త్ర కూడళ్లల్లో, కూరగాయల కొనుగోలు కూడళ్లలోనూ ప్రజలు గుమికూడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదు. కేసులు తగ్గుతున్నాయని అలసత్వం తగదని, తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని