పేదల మాత్రలు.. పంపిణీ ఎప్పుడు..?
logo
Published : 15/06/2021 03:56 IST

పేదల మాత్రలు.. పంపిణీ ఎప్పుడు..?

డ్రగ్‌ స్టోర్స్‌లో భారీగా నిల్వలు

కొవిడ్‌తో నిలిచిన ఓపీ

ఈనాడు, అమరావతి

గుణదల ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొన్ని రోజులుగా మధుమేహంతో బాధపడుతోంది. ప్రతి నెలా విజయవాడ జీజీహెచ్‌లో పరీక్షలు చేయించుకుని ఆస్పత్రిలో ఇచ్చే మందులు తీసుకెళ్లి వాడుతుంది. షుగర్‌ మాత్రలతో పాటు బీకాంప్లెక్స్‌, జింకోవిట్‌, గ్యాస్‌ మాత్రలు ఉచితంగా ఇస్తారు. 15 రోజులకు ఈ మాత్రల ఖర్చు రూ.500కు పైగా ఉంటుంది. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో జీజీహెచ్‌ను రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చారు. సాధారణ రోగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి నాడి పట్టడం లేదు. మందులు ఇవ్వడం లేదు. దీంతో బయట కొనుగోలు చేస్తే నెలకు రూ.1500 వరకు ఖర్చు అవుతున్నాయి. ఇది ఆ ఒక్క మహిళ వ్యధ కాదు. ఇలా వేల మంది దీర్ఘకాలిక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.


బందరుకు చెందిన ఓ వ్యక్తికి రక్తపోటు (బీపీ) ఉంది. బందరు జిల్లా ఆస్పత్రిలో నెలనెలా పరీక్షలు చేయించుకుని అక్కడే మందులు తీసుకుని వాడతారు. ఆయనకు గతంలో ప్రభుత్వం ఉచితంగా అందించేది. ప్రస్తుతం ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. నెలకు సరిపడే మందులు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతున్నాయి. గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి. బందరు జిల్లా ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడం వల్ల అక్కడ ఓపీ లేదు. సాధారణ పరీక్షలు చేయడం లేదు. కనీసం బీపీ చెక్‌ చేసే పరిస్థితి లేదు.


కొవిడ్‌ వల్ల నిరుపేదలపై మందుల భారం పడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి నెలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే మందులు తీసుకెళ్లేవారు. గత మూడు నెలలుగా ఈ మందులు వారికి అందుబాటులో లేవు. ప్రైవేటు మందుల దుకాణాల్లో తీసుకుంటున్నారు. దీంతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పడుతోంది. కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చడంతో అక్కడా మందులు లభించడం లేదు. ప్రధానంగా విజయవాడ జీజీహెచ్‌, బందరు జిల్లా ఆస్పత్రికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు ఆర్థికంగా కష్టాలు తప్పడం లేదు. మరోవైపు జీజీహెచ్‌, జిల్లా ఆస్పత్రుల్లో రూ.కోట్ల విలువైన మందులు నిల్వ ఉన్నాయి. త్వరలో కాలం చెల్లినవిగా మారే ప్రమాదం ఉందని తెలిసింది. సాధారణ రోగులకు ఇచ్చే మందులన్నీ నిల్వ ఉన్నాయి. గత మూడు నెలలుగా పంపిణీ చేయలేదు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి జిల్లా ఆసుపత్రి, జీజీహెచ్‌కు పంపిణీ చేసినా రోగులకు అందడం లేదు. కారణం రోగులను ఇక్కడ పరీక్షించడం లేదు. ఈ రెండు ఆస్పత్రుల్లో మధుమేహ రోగులు, రక్తపోటు, థైరాయిడ్‌ సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత ఉన్నవారు పరీక్షించుకుంటారు. జీజీహెచ్‌లో కార్డియాలజిస్టు స్పెషలిస్టు లేరు. దీంతో హృద్రోగ సమస్యలు ఉన్నవారికి సేవలు అందడం లేదు. వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి రోగులకు రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు ఉచితంగా అందుతాయి. వాటిని పరిశీలించి మందులు ఇస్తారు. మధుమేహ రోగులు ప్రతి 15 రోజులకు వచ్చి మందులు తీసుకెళ్తారు. వీరికి ఒక పుస్తకం ఇచ్చి మందులను సరఫరా చేస్తుంటారు. మధుమేహ రోగులు 15 రోజులకు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించుకుంటారు. ఇవి బయట చేయించాలంటే రూ.300 వరకు ఖర్చు అవుతుంది. వీరికి చెక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్‌ కూడా అందిస్తారు. జీజీహెచ్‌కు రోజుకు 100 మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు వచ్చేవారు. నెలకు దాదాపు 3వేల మందికి పైగా ఉచితంగా మందులు అందించేవారు. కొంతమందికి వారం సరిపడా ఇస్తే.. మరికొంత మందికి 15 రోజులకు సరిపడా మాత్రలు అందించేవారు. ప్రస్తుతం వీరంతా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


రూ.కోట్లలో భారం..!

ఏడాదిగా కొవిడ్‌ వల్ల దీర్ఘకాలిక రోగులకు ఈ మందులు అందడం లేదు. దీంతో పేదలపై భారం పడింది. విజయవాడ జీజీహెచ్‌లో రోజుకు 1500 మంది వరకు అవుట్‌ పేషంట్లు వచ్చేవారు. వీరిలో 750 మంది వరకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఉండేవారు. గతేడాది మార్చిలో కొవిడ్‌ ప్రారంభమైంది. సెప్టెంబరు వరకు ఓపీ చూడలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి నుంచి ఓపీ చూడలేదు. దాదాపు 11 నెలలు మందులు అందలేదు. బందరు విజయవాడ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అక్కడ రోజుకు 500 మందికి పైగా ఓపీ ఉంటుంది. పూర్తిగా నిలిచిపోయింది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి అందించే మందులు నిలువ ఉన్నాయి. బందరు ఆసుపత్రి, విజయవాడ జీజీహెచ్‌కు కలిపి నెలకు మందుల కోసం రూ.5కోట్ల వరకు కేటాయిస్తున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్ల నుంచి వీటిని తీసుకుంటారు. ఇవి సరిపోకపోతే.. అత్యవసరంగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కొవిడ్‌ చికిత్సలో ఒకటే ప్రొటో కాల్‌ ఉంది. కొన్ని రకాల మాత్రలనే వినియోగించారు. మిగిలినవన్నీ నిలువ ఉన్నాయి. ఇవి పాడయ్యే ప్రమాదం ఉంది. వీటి గడువు తీరకముందే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పంపిణీ చేయాలని కోరుతున్నారు.


కొవిడ్‌ వల్ల ఇవ్వడం లేదు..!

- జయకుమార్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రి

జిల్లా ఆస్పత్రిలో ప్రతి బుధవారం, శుక్రవారం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అందించేవారం. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులు సరిపోయేవన్నీ తీసుకుంటాం. బడ్జెట్‌ అంటే ఏమీ లేదు. కొవిడ్‌ వల్ల నిలిపివేసిన విషయం వాస్తవమే. మళ్లీ ఓపీ పునరుద్ధరిస్తే మందులను అందిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని