12 పంటలకు ఉచిత బీమా పథకం వర్తింపు
logo
Published : 15/06/2021 03:34 IST

12 పంటలకు ఉచిత బీమా పథకం వర్తింపు

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ వై.ఎస్‌.ఆర్‌. ఉచిత పంటల బీమా పథకాన్ని అందించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. ప్రస్తుతం 12 పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో, ఇందులో మరికొన్ని చేరిస్తే రైతులకు మరింత సహాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని విడిది కార్యాలయంలో పంటల బీమా పథకంపై సోమవారం నిర్వహించిన కార్యశాలలో ఆయన సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు, వర్ష పాతం, తేమ, గాలి శాతం తదితరాలను ప్రామాణికంగా తీసుకుని పంటల బీమా అందించే క్రమంలో.. కృష్ణా నది తీరాన సాగయ్యే అరటి, పసుపు తదితర పంటలకు బీమా వర్తింపచేయడం లేదని పలువురు రైతులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈక్రమంలో కృష్ణా నది వరదల కారణంగా నష్టపోయిన పంటలనూ పరిగణనలోకి తీసుకుని, పంటల బీమా వర్తింపచేస్తామన్నారు. జిల్లాలో 2020 ఏడాది ఖరీఫ్‌లో 1,50,026 ఎకరాలకు సంబంధించి 84,648 మంది రైతులకు రూ.170.43 కోట్ల బీమా సొమ్ము అందజేసినట్టు తెలిపారు. మిగిలిన రైతులను ఈ పథకంలో చేర్చేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. ఇ-క్రాప్‌ నమోదు, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషను తదితరాలను సరిగా నమోదు చేయని కారణంగా సాయం అందలేదని ఏ రైతు నుంచి ఫిర్యాదు రాకూడదని ఆయన హెచ్చరించారు.

మండల స్థాయిలో ప్రతి నెలా సమీక్షలు

రైతు అనుబంధ శాఖల అధికారులతో ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. వీటి ద్వారా మండలాల్లోని రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే వీలుందన్నారు. జిల్లాలో 466 కొనుగోలు కేంద్రాల ద్వారా 25,677 మంది రైతుల నుంచి 3.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. సొమ్ము చెల్లింపుల్లో జాప్యంపై రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. జేసీ కె.మాధవీలత, జేడీఏ టి.మోహనరావు, లీడ్‌ బ్యాంకు మేనేజరు రామ్మోహనరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, ఉద్యాన శాఖ డీడీ రవికుమార్‌, ఏడీ దయాకరబాబు, ఏడీఏ శ్రీనివాసులు, ఐఎండీ డైరెక్టరు స్టెల్లా, కేవీకే (ఘంటసాల) ప్రోగ్రాం సమన్వయకర్త ఝాన్సీ, శాస్త్రవేత్త జి.స్రవంతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ జె.రాఘవరావు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మూడంచెల ప్రణాళికతో భవన నిర్మాణాల పూర్తి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టరు జె.నివాస్‌ సోమవారం సమీక్షించారు. పునాది దశలో ఉన్నవి శ్లాబ్‌ స్థాయికి, శ్లాబు దశలోనివి పనుల పూర్తికి, పూర్తయిన భవనాలను సంబంధిత శాఖలకు అప్పగించేలా.. ఇలా మూడంచెల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. భవనాల పనుల విషయంలో రెండు వారాల గడువు ఇస్తామని, సదరు పనులు చురుగ్గా సాగకపోతే ఆయా అధికారులు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించేందుకు డ్వామా కార్యాలయం నుంచి ఒకరిని నోడల్‌ అధికారిగా నియమించాలని సూచించారు. పనుల ప్రగతిపై ప్రతి వారం నివేదికలను అందజేయాలన్నారు. నియోజకవర్గంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించుకోవాలని, పలు సమావేశాలకు తాను హాజరు కానున్నట్టు తెలిపారు. జేసీ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, శిక్షణ కలెక్టరు ఎస్‌.ఎస్‌.శోభిక, డ్వామా పీడీ జి.సూర్యనారాయణ, పీఆర్‌ ఎస్‌ఈ ప్రకాష్‌ నాయుడు, ఈఈలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని