అప్పుల కోసం.. అస్తుల కుదవ
logo
Published : 15/06/2021 03:16 IST

అప్పుల కోసం.. అస్తుల కుదవ

కొవిడ్‌ చేసిన గాయానికి విలవిల..!

అత్యధికంగా తనఖా రిజిస్ట్రేషన్లు

ఈనాడు, అమరావతి

వ్యాపార వర్గాలే ఎక్కువ!

కొవిడ్‌ చేసిన గాయానికి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. చేబదుళ్లు పుట్టడం లేదు. ఉన్న ఇల్లో, స్థలమో అమ్ముదామంటే వాటి క్రయ, విక్రయాలు మందగించాయి. దీంతో కరోనా వైద్యం, ఇతరత్రా అవసరాల కోసం చేసిన అప్పులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలకు వెళ్లి స్థిరాస్తులను కుదవ పెట్టి రుణాలు పొందడం ఇటీవల ఎక్కువైంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లావాదేవీలను పరిశీలిస్తే అత్యధికం తనఖా రిజిస్ట్రేషన్లే అవుతున్నాయి. సేల్‌ డీడ్లు, ఆస్తుల దఖలు(గిప్ట్‌), భాగస్వాముల మధ్య ఆస్తుల పంపకాలు(పార్టీషన్లు) వంటి రిజిస్ట్రేషన్లు చాలా స్వల్పంగా జరుగుతున్నాయని, తనఖాలే ఎక్కువగా ఉంటున్నాయని రిజిస్ట్రేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ కోసం పది డాక్యుమెంట్లు వస్తే వాటిల్లో సగానికి పైగా తనఖాలే ఉంటున్నాయని అంటున్నారు. మార్కెట్లో అన్‌ రిజిస్టర్డ్‌ ఫైనాన్స్‌ వ్యాపారుల నుంచి అప్పులు పుట్టకపోవటంతో ప్రత్యామ్నాయంగా బ్యాంకులు, రిజిస్టర్డ్‌ ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వీటి నుంచి రుణం పొందాలంటే కచ్చితంగా తీసుకునే రుణానికి సరిపడా ఆస్తిని తనఖా పెట్టాలి. అప్పుడే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. వరుసగా రెండేళ్ల నుంచి కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలానికి సగటున ప్రతి కుటుంబం ఏదో విధంగా ప్రభావితమైంది.


చంద్రమౌళీనగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబం అంతా వైరస్‌ బారిన పడడంతో ఆస్పత్రి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10లక్షలు చెల్లించారు. దీంతో కొరిటిపాడులో ఉన్న తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.15లక్షలు రుణం పొందారు.

దాచేపల్లికి చెందిన బీఈడీ ఉపాధ్యాయిని తన తండ్రికి కరోనా వైద్యానికి రూ.8లక్షలు అవడంతో ఆమె గుంటూరులో ఉన్న ఓ ప్లాటును బ్యాంకులో తనఖా పెట్టి రూ.15లక్షలు పొందారు.


బ్రాడీపేటకు చెందిన వస్త్ర వ్యాపారి షాపునకు నెలవారీ అద్దె రూ.40 వేలు, కరెంటు బిల్లు రూ.5వేలు, ముగ్గురు గుమాస్తాలకు నెలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.30వేలు చెల్లించాలి. మొత్తంగా నెలవారీ ఖర్చు రూ.75వేలు వస్తోంది. కానీ మే 5 నుంచి కర్ఫ్యూ అమలుతో షాపు ఒంటి గంటకే మూతపడడంతో రోజువారీ విక్రయాలు సగటున రూ.2-3 వేలు కూడా జరగడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయాలు అధిగమించేందుకు తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.10లక్షలు రుణం పొందినట్లు వివరించారు.


రోనా మొదటి, రెండో దశ దెబ్బకు వ్యాపారాలు కుదేలయ్యాయి. గతేడాది నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించడం, ఈ ఏడాది ఇప్పటికే 40 రోజులకు పైగా నుంచి కర్ఫ్యూ కొనసాగడంతో ఏ వ్యాపారాలు సజావుగా సాగడం లేదు. దీంతో గుంటూరు నగరం సహా తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె తదితర పట్టణాల్లోని వర్తక, వ్యాపార వర్గాలు మధ్యాహ్నానికే దుకాణాలు మూసివేస్తున్నారు. ఈ కారణంగా కనీసం నిర్వహణ వ్యయాలు రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. షాపుల నిర్వహణ వ్యయాల కోసం వ్యాపార వర్గాలు ఎక్కువగా బ్యాంకు రుణాలు తీసుకోవటానికి వస్తున్నారని గుంటూరు లక్ష్మీపురంలోని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. వ్యవసాయ సీజన్‌ కావడంతో అన్నదాతలు తమ పొలాలు, ఇళ్లు, ప్లాట్లు వంటివి తనఖాలు పెట్టి రుణాలు తీసుకుంటున్నారని గుంటూరు జిల్లా రిజిస్ట్రార్‌ రామ్‌కుమార్‌ తెలిపారు.


బ్యాంకు ఫీల్డు ఆఫీసర్‌ ఒకరు మాట్లాడుతూ ‘తన పదేళ్ల సర్వీసులో డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్లు పెట్టుకుని తనఖా రుణాలు ఇంతగా గతంలో ఎప్పుడూ ఇవ్వలేదని’ చెప్పారు. ప్రతి రోజూ నాలుగైదు ఎంక్వైరీలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని