రూ.97.72 లక్షల విలువైన గుట్కాల పట్టివేత
logo
Published : 15/06/2021 02:57 IST

రూ.97.72 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

కీలక నిందితుడు సహా ఆరుగురి అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా, ఖైనీలను పరిశీలిస్తున్న గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: 48 గంటల పాటు గుంటూరు రూరల్‌ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో రూ.97.72 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలు గుంటూరు జిల్లాలో స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో గుట్కా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న బెంగళూరుకు చెందిన కీలక నిందితుడితో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశాల మేరకు గుంటూరు రూరల్‌ పరిధిలో రెండు రోజుల పాటు పోలీసులు గుట్కా, ఖైనీ, గంజాయి తదితర నిషేధిత మత్తు పదార్థాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. నరసరావుపేట, తెనాలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది సమష్టిగా నిర్వహించిన దాడుల్లో రూ.97.72 లక్షల విలువైన నిషేధిత మత్తు పదార్థాలను జప్తు చేశారు. చిలకలూరిపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఎస్సై అజయ్‌బాబుకు వచ్చిన సమాచారంతో డీఎస్పీలు, సీఐలు కలిసి కిలో గంజాయి, రూ.63.20 లక్షల విలవైన గుట్కా, ఖైనీ, నకిలీ సిగరెట్లు పట్టుకున్నారు. తెనాలి ఒకటో పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.11 లక్షలు, నరసరావుపేట రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.6.30 లక్షలు, వినుకొండ పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.11.20 లక్షలు, శావల్యాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో రూ.ఆరు లక్షల విలువైన నిషేధిత మత్తు పదార్థాలు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

కీలక సూత్రధారి అరెస్టు

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న క్రమంలో గుట్కాలు సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులపై లోతుగా దర్యాప్తు చేసినట్లు ఎస్పీ చెప్పారు. బెంగళూరుకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌ అనే సంస్థకు చెందిన సిద్ధప్ప ఆంజనేయ తెల్గార్‌ అలియాస్‌ సిద్ధుగా తేలిందన్నారు. కర్ణాటకలోని ధార్వాడకు చెందిన అతను గుంటూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎనిమిది జిల్లాలకు గుట్కాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతను ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌, బెంగళూరులో తయారీదారుల నుంచి ఇతర ప్రాంతాలకు పార్సిల్‌ సంస్థల ద్వారా సరఫరా చేస్తున్నాడని చెప్పారు. అతనితో పాటు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కొప్పరపు మణికంఠ, దర్శికి చెందిన కొనకల ఆంజనేయులు, చిలకలూరిపేటకు చెందిన చికోటి రాజు, తెనాలికి చెందిన కుండూరు రామకృష్ణ, శావల్యాపురానికి చెందిన పారా లింగేశ్వరరావులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని మరికొంత మంది గుట్కా రాకెట్‌ సూత్రధారులను అరెస్టు చేయడానికి కర్ణాటకతో పాటు మరో రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు బృందాలను పంపించామన్నారు. పెద్ద మొత్తంలో గుట్కాలను పట్టుకున్న ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరావు, తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని