వాహన మిత్రకు22,527 మంది ఎంపిక
logo
Updated : 15/06/2021 03:31 IST

వాహన మిత్రకు22,527 మంది ఎంపిక

పట్టాభిపురం: వాహనమిత్ర పథకానికి జిల్లాలో ఈ ఏడాది 22,527 మందిని ఎంపిక చేసినట్లు గుంటూరు ఉపరవాణా శాఖ కమిషనర్‌ మీరాప్రసాద్‌ వెల్లడించారు. ఇందులో 18,212 మంది పాత లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 4,315 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కలెక్టర్‌ లబ్ధిదారులను ఎంపిక చేయగా ఈనెల 15న సీఎం రూ.10 వేల వంతున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని వివరించారు.


ఆన్‌లైన్‌ పోటీల ఫలితాల వెల్లడి

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాస్త్ర, సాంకేతి విజ్ఞాన మండలి, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా ‘పచ్చదనం పెంపుపై విద్యార్థుల బాధ్యత’ అన్న అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన వ్యాసరచన పోస్టరు ప్రెజెంటేషన్‌ ఫలితాలను జిల్లా సెన్సు అధికారి మైనం హుస్సేను సోమవారం విడుదల చేశారు. సీనియర్‌, జూనియర్‌ క్యాటగిరీలలో ఉత్తంగా వచ్చిన పదింటిని ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు, బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను విద్యార్థులకు ఫోను ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.


3వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రవాణా

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: కరోనా రోగులకు వైద్యం అందించేందుకు రైల్వే శాఖ 30 రోజుల వ్యవధిలో రాష్ట్రానికి 3 వేల టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్లలో విజయవంతంగా రవాణా చేసింది. ఇప్పటి వరకు 78 ట్యాంకర్ల ద్వారా గుంటూరుకు 1481 మెట్రిక్‌ టన్నులు, 54 ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టుకు 1080 మెట్రిక్‌ టన్నులు, 52 ట్యాంకర్లను తాడిపత్రికి 497 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. మొత్తం 48 ప్రత్యేక రైళ్ల ద్వారా 184 కంటైనర్లతో 3,058.58 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి ఏపీకి రప్పించారు. ఆక్సిజన్‌ రైళ్లను సకాలంలో ఏపీీకి చేర్చిన అధికారులు, సిబ్బందిని రైల్వే జీఎం గజానన్‌మల్యా అభినందించారు.


జిల్లా అంతటా వానలు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఒక్క ఉంగుటూరు మండలం మినహా మిగతా అంతటా వర్షాలు కురిశాయి. జగ్గయ్యపేటలో అత్యధికంగా 63.4 మి.మీ., గుడివాడ, పెదపారుపూడిలో అత్యల్పంగా 1.2 మి.మీ. వర్షం పడింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 774.8 మి.మీ. వర్షం పడింది. నూజివీడులో 42.2, చందర్లపాడు 41.2, వీరులపాడు 34.2, తిరువూరు 29.4, నందిగామ 28, మొవ్వ 27.2, చల్లపల్లి 26.4, కృత్తివెన్ను 26.2, పెనుగంచిప్రోలు 25.6, ఆగిరిపల్లి 24.8, రెడ్డిగూడెం 22.4, మండవల్లి 19.4, పమిడిముక్కల 18.8, గంపలగూడెం 18.2, కంచికచర్ల 17.8, కలిదిండి, ఉయ్యూరు 17.6, వత్సవాయి 17.2, మచిలీపట్నం 16.2, ఎ.కొండూరు 15.6, జి.కొండూరు 14.6, బాపులపాడు 13.2, కైకలూరు 12.6, విజయవాడ 12.4, చాట్రాయి 12.2, ఇబ్రహీంపట్నం 11.4, విస్సన్నపేట, తోట్లవల్లూరు 11.2, మైలవరం 10.6, ముదినేపల్లి, పెనమలూరులో 10.4, మిగతా మండలాల్లో 2.6 మి.మీ. నుంచి 9.2 మి.మీ. వరకు వర్షం పడింది.


లాంఫాంలో అపరాల విత్తనాలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: తొలకరిలో రైతులు విత్తేందుకు అనువైన అపరాల విత్తనాలు గుంటూరుకు సమీప ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో అందుబాటులో ఉన్నాయని ఇంఛార్జి ఏడీఆర్‌ రత్నప్రసాద్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంది ఎల్‌ఆర్‌జీ-52, మినుము వీబీఎన్‌-8, పీయూ 31, పెసర ఐపీఎం 2-14 రకాలను రైతుల కోసం అందుబాటులో ఉంచామని వివరించారు.


సంగం డెయిరీ కేసులో సెర్చ్‌ వారెంట్‌ పిటీషన్‌ కొట్టివేత

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే : సంగం డెయిరీలో తనిఖీల కోసం సెర్చ్‌ వారెంట్‌ రీకాల్‌ చేయాలని కోరుతూ అనిశా అధికారులు వేసిన పిటీషన్‌ను విజయవాడ ఇన్‌ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి కొట్టి వేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన అనిశా(అవినీతి నిరోధక శాఖ) అధికారులు.. ఏప్రిల్‌ 23 నుంచి మే 16వ తేదీ వరకు అందులో తనిఖీలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు మరికొంత సమయం కావాలని మే 17న విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ఇప్పటికే 24 రోజుల పాటు తనిఖీలు చేశారని, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయపడుతూ.. పిటీషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని