AP News: రూ.50 కోట్ల మేర బురిడీ..!
logo
Updated : 15/06/2021 08:16 IST

AP News: రూ.50 కోట్ల మేర బురిడీ..!

స్థిరాస్తి వ్యాపారి కుచ్చుటోపి

విలేకరుల వద్ద తమ ఆవేదనవెలిబుచ్చుతున్న బాధిత మహిళలు

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: స్థిరాస్తి పేరిట గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యాపారి బాధితులకు రూ.50 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు అమరావతి రోడ్డులోని ద్వారకానగర్‌కు చెందిన పోతుగుంట్ల సాంబశివరావు, ఆయన భార్య అరుణ, కుమారుడు ప్రశాంత్‌లతో కలిసి ఏళ్ల తరబడి చిట్టీలు, ఫర్నిచర్‌ దుకాణాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదపరిమిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నానని.. మా వెంచర్‌లోని ప్లాట్లను విక్రయాలకు అందుబాటులో ఉంచినట్లు సాంబశివరావు తెలిసిన వారందరికీ చెప్పాడు. ఈ మేరకు 300 మంది స్నేహితులు, పరిచయం ఉన్న వారి వద్ద నుంచి రూ.2 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈవిధంగా సుమారు రూ.50 కోట్లు వసూలు చేశాడంటున్నారు. నెలలు దాటుతున్నా సాంబశివరావు ఆ వెంచర్‌లో ముందుగా పేర్కొన్న ప్లాట్లు రిజిస్టర్‌ చేయకపోడంతో డబ్బులు కట్టిన బాధితులు.. నగదు తిరిగి ఇచ్చేయాల్సిందిగా విన్నవించారు. ఏవో సాకులు చెబుతూ కాలయాపన చేస్తుండడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పెద్దఎత్తున సోమవారం సాంబశివరావు నివాసాన్ని చుట్టుముట్టారు. విషయం ముందే తెలుసుకున్న ఆ వ్యాపారి.. కుమారుడు ప్రశాంత్‌తో కలిసి పరారైనట్లు తెలిసి బాధితులు నల్లపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సాంబశివరావు భార్య అరుణను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కూలి పనులు చేసుకుని కూడబెట్టుకున్న నగదు వారికి చెల్లించామని, బాధితుల నుంచి డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నల్లపాడు సీఐ పి.ప్రేమయ్య మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఉన్నతాధికారుల సూచనల మేరకు విచారణ చేసి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని