ఆ ఊళ్లో రెండ్రోజుల్లో 32 కేసులా?
logo
Published : 15/06/2021 02:53 IST

ఆ ఊళ్లో రెండ్రోజుల్లో 32 కేసులా?

ఈనాడు, అమరావతి

జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయనుకుంటున్న వేళ ఒకే ఒక కుగ్రామంలో గడిచిన రెండు రోజుల్లో 32 కేసులు నమోదు కావడం వైద్యవర్గాలను ఆందోళన పరిచింది. అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం అత్యధికంగా 23 కేసులు రాగా ఆదివారం 9 కేసులు నమోదయ్యాయి. కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఇన్ని కేసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోపం ఎక్కడ ఉందని వైద్యవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. జిల్లాలో సోమవారం 322 కేసులు నమోదైతే అందులో 23 కేసులు కొత్తపల్లిలోనే ఉండడం గమనార్హం. మొత్తం కేసుల్లో 9 శాతం వరకు ఈ గ్రామంలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి వెళ్లిన వైద్య బృందం ఆ గ్రామంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపింది. వాటి ఫలితాలు ఆది, సోమవారం వచ్చాయి. వీరు జరిపిన పరీక్షల్లోనే ఆ కేసులు బయటపడ్డాయి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, కనీసం రోజుకు 150కు తగ్గకుండా చేయాలని ఇంతకు ముందే జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇటీవల కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరగడం లేదని, ఇందుకు బాధ్యులైన వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా కొందరు వైద్యాధికారులు అప్రమత్తం కాలేదనడానికి కొత్తపల్లి ఉదంతమే నిదర్శనం. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాంటిది చిన్న గ్రామం కొత్తపల్లిలో ఒకేసారి ఇన్ని కేసులు రావటం యంత్రాంగం నిర్లక్ష్యాన్ని చాటుతోంది. జిల్లా కేంద్రం నుంచి ఆ గ్రామానికి వైద్య బృందం వెళ్లి పరీక్షలు జరిపే వరకు స్థానిక పీహెచ్‌సీ అధికారులు ఏం చేశారు? స్థానిక వైద్యాధికారులు ఆ ఊళ్లో పరీక్షలు చేశారా లేదా? ఒకవేళ చేస్తే కేసులు ఎందుకు బయటపడలేదు, ఇక్కడ ఏం జరిగి ఉంటుందనే కోణంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు ఆరా తీస్తున్నాయి. కేసులు ఇంత ఉద్ధృతంగా రావటంపై అచ్చంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌చందు మాట్లాడుతూ ఆ గ్రామంలో ఇటీవల రెండు శుభకార్యాలు జరిగాయని, వాటి ద్వారానే కరోనా వ్యాప్తి చెంది ఉండొచ్చని తెలిపారు. ఉపాధి పనులకు గుంపులుగా వెళ్తున్నారని, వైరస్‌బారిన పడినవారిలో చాలా మంది వారే ఉన్నారని చెప్పారు.

అమరావతి మండలం జూపూడి గ్రామంలోనూ ఆది, సోమవారం కలిపి 16 కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామంలోనూ కేసులు అధికంగా రావడంపై యంత్రాంగం ఆరా తీస్తే ఇక్కడ నుంచి కూలి పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అధికంగా ఉన్నారని, వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట, అమరావతి పీహెచ్‌సీల పరిధిలో అత్యదిక కేసులు రావడంతో ఆ ఇద్దరు అధికారులను సంజాయిషి కోరాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని