విధేయతకు పట్టం
logo
Updated : 15/06/2021 05:01 IST

విధేయతకు పట్టం

లేళ్ల అప్పిరెడ్డి

ఈనాడు, అమరావతి:  వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా పేరు ఖరారైంది. వైకాపా స్థాపన నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటమే కాకుండా విధేయుడిగా ఉండటంతో పదవి దక్కిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నించినా సామాజిక, రాజకీయ సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కలేదు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అప్పట్లో పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చాక తొలుత ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీలకు ఎంపిక చేస్తారని భావించినా అవకాశం దక్కలేదు. తాజాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి వరించింది. అప్పిరెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. నగరంలో యువతతోపాటు క్యాడర్‌లో పట్టు ఉండటం, విద్యార్థి, యువజన, నగర అధ్యక్షుడిగా పనిచేయడంతో ఆ వర్గాల్లో పట్టు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్‌ఎస్‌యూఐలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆరేళ్ల పాటు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జూట్‌ మిల్లు కార్మిక సంఘం అధ్యక్షుడిగా, మిర్చియార్డు ముఠా వర్కర్స్‌ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదైనా కొట్టేశారు. 2003లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శిగా, 2007లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరుడిగా ఉన్నారు. 2006లో గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పదవి పొందారు. 2011-17వరకు వైకాపా గుంటూరు నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి తెదేపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో వైకాపా గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా సామాజిక సమీకరణాల్లో భాగంగా చంద్రగిరి యేసురత్నంకు పార్టీ టికెట్‌ ఇచ్చింది. పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థి విజయానికి పనిచేశారు. అయితే పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి ఓటమిపాలయ్యారు. 2020 నుంచి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితోపాటు పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. తొలి నుంచి వైఎస్‌ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగించడం కూడా కలిసొచ్చింది. ఎమ్మెల్సీలు ఎంపిక జరిగిన ప్రతిసారి జిల్లాలో ఎవరో ఒకరికి అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎంపిక జరిగిన ప్రతిసారి ఆయన పేరు తెర పైకి వస్తున్నా వివిధ సమీకరణాల్లో భాగంగా పదవి దక్కడం లేదు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం కల్పిస్తారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని