close

ప్రధానాంశాలు

Updated : 23/02/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగు నెలల కిందటే పన్నాగం

వామన్‌రావు కదలికలపై నిత్యం ఆరా
ట్రస్టుకు అడ్డుపడుతున్నారనే హత్య
కీలక సూత్రధారి బిట్టు శ్రీను అరెస్ట్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌-న్యూస్‌టుడే, గోదావరిఖని: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడంటారు. వామన్‌రావు దంపతుల విషయంలో ప్రధాన నిందితులైన బిట్టు శ్రీను, కుంట శ్రీనులు అలాగే మిత్రులయ్యారు. తాను ఛైర్మన్‌గా ఉన్న ట్రస్టు ఆగిపోయేలా చేయడం.. పంచాయతీలో నెలనెలా రూ. 30 వేలు తెచ్చిపెడుతున్న చెత్త వాహనాన్ని అడ్డుకోవడం తదితర కారణాలతో బిట్టు శ్రీను శత్రుత్వం పెంచుకోగా.. కుంట శ్రీను తాను నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి గుడి నిర్మాణం అక్రమమని ఫిర్యాదు చేయడంతో వామన్‌రావు, నాగమణి దంపతులపై కక్ష పెంచుకున్నారు. అలా తమ ఉమ్మడి శత్రువైన వామన్‌రావును చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ట్రాక్టర్‌ పట్టీలతో రెండు కత్తుల్ని తయారు చేయించి పెట్టుకున్నారు.. నాలుగు నెలలుగా ఎప్పుడు దొరకుతారా అని చూశారు.. చివరకు కిరాతకంగా హతమార్చారు. ఇదీ వామన్‌రావు కేసు సారాంశం. నాలుగు రోజులుగా బిట్టు శ్రీనును తమ అదుపులో ఉంచుకుని విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వారి పన్నాగాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. ఈ హత్యలో పాలు పంచుకున్న కుంట శ్రీనివాస్‌, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను ఈ నెల 18న అరెస్ట్‌ చేయగా.. వారికి కత్తులను, కారును సమకూర్చిన బిట్టు శ్రీనును 19న అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం రాత్రి అతడిని అరెస్ట్‌ చేసినట్లు నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అతడి ద్వారా ఈ కేసు వివరాలు వెల్లడయ్యాయని తెలిపారు.

బిట్టు శ్రీనుకు సంబంధమిలా..
పుట్ట లింగమ్మ ఛారిటబుల్‌  ట్రస్టు ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని వామన్‌రావు ఆరోపణలు చేస్తుండటం, ప్రజల్లో చులకన కలిగేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండటంతో ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న బిట్టు శ్రీను కోపం పెంచుకున్నాడు. అలాగే మంథని పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త తరలింపునకు ఒక ట్రాక్టర్‌ను పెట్టి నడిపిస్తున్నాడు. దానిపై ప్రతి నెలా రూ.30 వేల ఆదాయం వచ్చేది. 2019లో వామన్‌రావు అధికారులపై ఒత్తిడి చేయడంతో వారు దాన్ని తొలగించారు. ఇలా ప్రతి విషయంలో అడ్డుపడటమే కాకుండా వాటన్నింటినీ తాను సాధించిన విజయాలుగా వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడాన్ని బిట్టు శ్రీను జీర్ణించుకోలేకపోయాడు.

ఇద్దరి లక్ష్యం అతనే..
గుంజపడుగలో కుంట శ్రీను నిర్మిస్తున్న గుడి నిర్మాణం అక్రమమని వామన్‌రావు, నాగమణి దంపతులు ఫిర్యాదు చేసి కోర్టు నోటీసులు అతికించారు. గతంలోనూ ఓ ఫోన్‌కాల్‌ విషయమై కుంట శ్రీనుపై కేసు పెట్టడంతో వారి మధ్య వైరం కొనసాగుతోంది. గ్రామంలోని గోపాలస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్‌గా వామన్‌రావు తమ్ముడు కొనసాగుతుండగా, కుంట శ్రీను గ్రామస్థుల సహకారంతో పాత కమిటీని రద్దుచేసి వెల్ది వసంతరావును ఛైర్మన్‌గా నిర్ణయించాడు. ఈ విషయమై వామన్‌రావు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా అన్ని రకాలుగా తనకు అడ్డువస్తున్నాడని కుంట శ్రీను కూడా బిట్టు శ్రీను వద్ద ఆవేదన వ్యక్తంచేసేవాడు. క్రమంగా ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా మారిపోయారు. కలిసి తాగినపుడల్లా వామన్‌రావు ప్రస్తావనే ఎక్కువగా వచ్చేది. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు తొలగించుకుంటే కాని తమకు భవిష్యత్తు ఉండందని అనుకునేవారు. బిట్టు శ్రీను వామన్‌రావును చంపడానికి ఎలాంటి సహాయమైనా చేస్తానని కుంట శ్రీనుకు హామీ ఇచ్చాడు.

కత్తులను తయారు చేయించి మరీ..
పది నెలల నుంచి వామన్‌రావు హత్య కోసం ప్రణాళికల్ని రచిస్తున్నట్లు తెలిసింది. బిట్టు శ్రీను, కుంట శ్రీను తాగి మాట్లాడునే సమయంలోనే చిరంజీవి వీరితో జతకలిసేవాడు. నాలుగు నెలల కిందట మాటల మధ్యలో హత్య కోసం మంచి కత్తుల్ని తయారు చేయించమని కుంట శ్రీను కోరాడు. దీంతో బిట్టు శ్రీను ట్రాక్టర్‌ పట్టీలతో రెండు కత్తుల్ని తయారు చేయించి చిరంజీవి ఇంట్లో దాచిపెట్టాడు. వామన్‌రావు హైదరాబాద్‌ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఎలా వెళ్తున్నాడో గమనించేవారు. పలుమార్లు హతమర్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడోనని ఎదురు చూశారు. వామన్‌రావు, నాగమణి ఈనెల 17న మంథని కోర్డు వద్దకు వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న కుంట శ్రీను బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేశాడు. కచ్చితంగా నిర్ధారించుకోవాలని అతడు అనడంతో కోర్డు దగ్గర ఉన్న లచ్చయ్య ద్వారా నిజమేనని ధ్రువీకరించుకుని చెప్పాడు. దీంతో బిట్టు శ్రీను చిరంజీవికి ఫోన్‌ చేసి వారింట్లో ఉన్న కత్తులను తీసుకుని వెంటనే మంథని బస్టాండ్‌కు రావాలని చెప్పడంతో అతడు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి బిట్టు శ్రీనుకిచ్చాడు. వాటిని తన కారులో పెట్టి తీసుకు వెళ్లమని చిరంజీవికి చెప్పాడు. అతడు కుంట శ్రీనుతో కలిసి వెళ్లి కల్వచర్ల వద్ద అడ్డగించి వామన్‌రావు దంపతుల్ని హత్యచేశారు. ఈ విషయాన్ని బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పడంతో మహారాష్ట్రకు పారిపోమని సలహా ఇచ్చి తనకు ఏం తెలియనట్లు బిట్టు శ్రీను ఇంట్లో ఉండిపోయాడు. ముందుగా కుంట శ్రీను, చిరంజీవిలతోపాటు కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.

న్యాయవాదులను ఉద్దేశించి అనలేదు: సీపీ
గోదావరిఖని: తాను న్యాయవాదులను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. మంథని ఠాణాలో పనిచేస్తున్న పోలీసు అధికారులపై తరచూ ఎందుకు ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించగా, కొంతమంది ఒకరిపై ఒకరు పిటిషన్లు, దావాలు చేసుకుంటున్నారని, చిన్నచిన్న విషయాలకు న్యాయపరమైన వివాదాలు పెంచుకుని పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారనే ఉద్దేశంతో ‘లీగల్‌ ఫ్యాక్షనిజం’ నడుస్తోందని వ్యాఖ్యానించానే తప్ప న్యాయవాదులను ఉద్దేశించి కాదని సీపీ వెల్లడించారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన