
తాజా వార్తలు
ఎంపీ దేల్కర్ది ఆత్మహత్యే: 15పేజీల నోట్ లభ్యం!
భౌతికకాయం కుటుంబ సభ్యులకు అప్పగింత
ముంబయి: కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ స్వతంత్ర ఎంపీ మోహన్ దేల్కర్ది (58) ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన నిన్న దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. దీంతో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. పోస్టు మార్టం నివేదికలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారణ అయిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం దేల్కర్ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. దేల్కర్ విగత జీవిగా పడి ఉన్న గదిలో గుజరాతీలో రాసి ఉన్న 15 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైనట్టు సమాచారం.
ఎంపీ మోహన్ దేల్కర్ రాసిన సూసైడ్ నోట్లో కొంతమంది పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు మాత్రం ఆ పేర్లను బయటకు వెల్లడించలేదు. దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ దేల్కర్.. 2019లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఇప్పటిదాకా ఏడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ఆకస్మిక మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.