పుష్ప, సర్కారువారి పాట లీక్‌.. సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన నిర్మాణ సంస్థ - we are deeply disturbed by the recent leaks of our movie material online says mythri
close
Published : 16/08/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుష్ప, సర్కారువారి పాట లీక్‌.. సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన నిర్మాణ సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీకుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విడుదలకు ముందే పైరసీ యథేచ్చగా జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారువారి పాట’ ప్రచార చిత్రంతోపాటు ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్‌ మీడియాలో ముందే దర్శనమిచ్చాయి. సినిమా కంటెంట్‌ బహిర్గతం కావడంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

‘‘ఇటీవల మా సినిమా మెటీరియల్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంపై మేం తీవ్రంగా కలత చెందాం. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈమేరకు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశాం. నిందితులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు’’ అని నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

అల్లు అర్జున్‌ ప్రధానపాత్రలో.. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ప్రతినాయకుడిగా ఫహాద్‌ ఫాజిల్‌ నటించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక...’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ‘పుష్ప’ తొలి భాగాన్ని క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేస్తున్నారు. మరోవైపు.. హీరో మహేశ్‌బాబు-డైరెక్టర్‌ పరుశురామ్‌ కాంబినేషన్‌లో ‘సర్కారు వారి పాట’ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇటీవల మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రచార చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని