ప్రభుదేవా ఎంట్రీకి ఆ సినిమానే కారణం..!
close
Published : 09/05/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుదేవా ఎంట్రీకి ఆ సినిమానే కారణం..!

ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను: రాఘవేంద్రరావు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఓ కారణమని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. రాఘవేంద్రరావు అద్భుత సృష్టితో తెరకెక్కిన ‘జగదేకవీరుడు..’ చిత్రం విడుదలైన నేటితో 30 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఏవిధంగా పట్టాలెక్కింది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగి ఎన్నో మధుర జ్ఞాపకాలను దర్శకేంద్రుడు అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు చిరంజీవి సైతం ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు.

‘30 ఏళ్ల క్రితం వెండితెర వినీలాకాశంలో ఓ మెరుపు మెరిసింది. అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. అదే నా 70వ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు అయిన సందర్భంగా చిరంజీవి, నిర్మాత అశ్వనీదత్‌కు నేను థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటికే వరుస పరాజయాలతో ఉన్న నేను ఈ సినిమా చేయగలనా? లేదా? అని అందరూ అనుకుంటున్న సమయంలో చిరు, దత్తు ఈ కథకి నేను తప్పా వేరేవాళ్లు న్యాయం చేయలేరని నాకు చెప్పారు. అలా నేను ఈ కథను సినిమాగా తెరకెక్కించాను.’

‘ఈ సినిమాకీ ఏ ఇద్దరూ వ్యక్తులు లేకపోయినా ఇంత విజయం సాధించేది కాదు. చిరు-శ్రీదేవి, ఇళయరాజా-వేటూరి, జంధ్యాల-శ్రీనివాస చక్రవర్తి, సత్యమూర్తి-యండమూరి వీరేంద్రనాథ్‌, సుందరం-చలం... వీరందరీ కృషి వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కింది. ఎలాంటి గ్రాఫిక్స్‌ లేకుండా సినిమాలోని పలు సన్నివేశాలను మా డీవోపీ చాలా అద్భుతంగా చూపించారు.’

‘ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీదేవి భూలోకానికి వచ్చినప్పుడు ‘అందాలలో అహోమహోదయం’ అనే పాట షూట్‌ కోసం వాహినీ స్టూడియోలో చలం హిమాలయాల సెట్‌ వేశారు. నిజంగా ఒక దేవకన్య భూలోకానికి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటను దాదాపు 10 రోజులు చిత్రీకరించాం. అలాగే ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ అనే పాటను రెండు రోజుల్లో షూట్‌ చేశాం. అయితే ఆ పాట షూటింగ్‌ సమయంలో సుందరం మాస్టర్‌ బిజీగా ఉండడంతో ఆయన కుమారుడు ప్రభుదేవా మాస్టర్‌ ఈ పాటకు డ్యాన్స్‌ కొరియోగ్రఫి చేశారు. అలా ప్రభుదేవా ఎంట్రీకి కూడా ఆ పిక్చర్‌ ఒక కారణమైంది.గతంలో దుబాయ్‌లో జరిగిన ఓ సినిమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. అయితే అప్పుడు చిరు-శ్రీదేవి కలిసి ఆ అవార్డును నాకు అందించారు. వాళ్లిద్దరి చేతుల మీదగా అవార్డును అందుకోవడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఆ మధుర జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని రాఘవేంద్రరావు అన్నారు.


 
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని