దేవకన్య ఉంగరం ఏం చేయాలి?
close
Updated : 09/05/2020 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవకన్య ఉంగరం ఏం చేయాలి?

అద్భుత దృశ్యకావ్యం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి 30ఏళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌, ఓ మైలురాయిగా చెప్పుకొనే బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలై శనివారానికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరు- శ్రీదేవిల నటన, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నిర్మాత అశ్వనీదత్‌ సినిమాపై ఉన్న ప్యాషన్‌తో సుమారు రూ.8కోట్ల భారీ బడ్జెట్‌(అప్పట్లో)తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రెండితల వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు మీకోసం.

కథకు బీజం అలా పడింది

అశ్వనీదత్‌కు ఏనాటి నుంచో ఎన్టీఆర్‌ ‘జగదేకవీరుని కథ’లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవితో చేయాలని ఉండేది. అది కూడా రాఘవేంద్రరావులాంటి దర్శకుడు మాత్రమే తీయగలరని గట్టిగా నమ్మేవారు. ‘ఆఖరిపోరాటం’ తర్వాత ఎలాగైనా చిరుతో  సినిమా చేయాలనుకున్నారు దత్తు. ఆయనకు స్నేహితుడు‌, కో-డైరెక్టర్‌ అయిన శ్రీనివాస చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా, శ్రీనివాస చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. ‘దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది. అది చిరంజీవిగారికి దొరుకుతుంది’ తనకు వచ్చిన ఈ ఆలోచనను రాఘవేంద్రరావుకు చెప్పారు. ఆ తర్వాత అశ్వనీదత్‌కు కూడా నచ్చడంతో కథను సిద్ధం చేయడానికి కూర్చొన్నారు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్‌, సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్‌, తమిళ రచయిత క్రేజీ మోహన్‌ తదితరులు కసరత్తులు మొదలు పెట్టారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్‌ కూడా ఎంటరయ్యారు. అందరి సలహాలు తీసుకుంటూ కథను సిద్ధం చేశారు. జగదేక వీరుడిగా చిరంజీవి ఓకే మరి అతిలోక సుందరి? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే శ్రీదేవి. ఆమెకు కూడా కథ నచ్చడంతో మిగిలిన నటీనటుల ఎంపిక పూర్తి చేశారు.

చిరంజీవి-శ్రీదేవి ఎక్కడ కలవాలి?

‘దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పొగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ భూలోకానికి వస్తుంది’ ఈ పాయింట్‌ ఓకే మరి దేవకన్య, మానవుడు ఎక్కడ కలవాలి? చిరంజీవి-శ్రీదేవి అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు ఉండాలి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసే తొలి సన్నివేశంపైనే తర్జనభర్జనలు పడింది చిత్ర బృందం. తొలుత అనుకున్న కథ ప్రకారం.. ‘గాయాల పాలైన పాపకు వైద్యానికి రూ.లక్షలు ఖర్చవుతాయి. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపైకి ఒక మిషన్‌ను నిర్వహించాలనుకుంటుంది. స్పేస్‌షిప్‌లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి లక్షల్లో డబ్బు ఇస్తానని చెబుతుంది. ఆ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్‌షిప్‌లో చంద్రుడిపైకి వెళ్తారు. అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమ్మీదకు వస్తుంది’ ఇది పూర్తి కథ సిద్ధం కాకముందు అనుకున్న ఒక థీమ్‌. అయితే, చంద్రుడు, స్పేస్‌షిప్‌ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు, చిత్ర బృందం భావించింది. దీనిపై చర్చిస్తుండగా, ‘మానససరోవరం అయితే ఎలా ఉంటుంది’ అని చిరంజీవి అనడంతో అందరికీ నచ్చి, కథను ఆ దిశగా మార్చారు రచయితలు.

ఆయనను పెట్టుకుని సినిమా తీయడమేంటి?

అశ్వనీదత్‌కు మొదట ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తేనే బాగుంటుందని నమ్మారు. అయితే, ఈ సినిమా కన్నాముందు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. అయినా రాఘవేంద్రరావుపై అశ్వనీదత్‌, చిరంజీవికి నమ్మకం ఉంది. అయితే ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తు మాత్రం ‘ఆయనను పెట్టుకుని తీయడమేంటి. మీకు మతి ఉందా? లేదా?’ అని చిరును, అశ్వనీదత్‌ను అన్నారట. ఇలాంటి సోషియో ఫాంటసీ సినిమాను తీయాలంటే రాఘవేంద్రరావు వల్లే అవుతుందని బలంగా నమ్మిన అశ్వనీదత్‌ మరో ఆలోచన చేయలేదు.

టైటిల్‌ ఏం పెట్టాలి?

కథ రెడీ, నటీనటులు కూడా ఓకే. ఇక అందరూ ఆసక్తిగా ఎదరు చూసింది ‘ఏం టైటిల్‌ పెడతారు’. కథ చర్చల సందర్భంగా పలు టైటిళ్లు అనుకున్నారు. కానీ, అశ్వనీదత్‌ మదిలో మాత్రం ఉన్నది ఒక్కటే అలనాటి ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’. అందుకే ఈ టైటిల్‌కు జగదేకవీరుడు అని పెడదామనుకున్నారు. కానీ, కథానాయిక పాత్ర కూడా బలంగా ఉండటం, దేవకన్య కావడంతో ‘అతిలోక సుందరి’ అని జోడించారు. ‘టైటిల్‌ చాలా పెద్దగా ఉంది. జనాల్లోకి వెళ్తుందా’ మరో ప్రశ్న. అశ్వనీదత్‌ కోరిక మేరకు మార్పులు చేయకుండా అలాగే ఉంచేశారు.

మేజిక్‌ చేసిన ఇళయరాజా

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం వెనుక ఎంతోమంది విజేతలు ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విల్సన్‌‌, అందమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం, ఎడిటింగ్‌ స్కిల్స్‌తో మెప్పించిన చంటి, మాటలు, పాటలతో ఆశ్చర్యపరిచిన వేటూరి, జంద్యాల.. వీళ్లందరి కష్టానికి ప్రాణం పోసిన ఒకే ఒక్క లెజెండ్‌.. మ్యాస్ట్రో ఇళయరాజా.

ఈ సినిమాలోని పాటలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ మెలోడి, క్లాస్‌ సాంగ్స్‌. చిరు-శ్రీదేవి అంటే ప్రేక్షకులు మాస్‌ సాంగ్‌ కోరుకుంటారు. దీంతో రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. కానీ అశ్వనీదత్‌కి ఇళయరాజా ట్యూన్‌ను మార్చడం ఇష్టం లేదు. ఆ సమయంలో వేటూరి ఇదే ట్యూన్‌ను మాస్‌ సాంగ్‌గా మారుస్తాను చూడండి అన్నారు. అలా.. ‘అబ్బని తీయని దెబ్బ’ రాశారు. క్లాస్‌ ట్యూన్‌ని తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద మాస్‌ ట్యూన్‌గా మార్చారు ఆ ఇద్దరు లెజెండ్స్‌.. వాళ్లే వేటూరి, ఇళయరాజా. ఈ పాటను మైసూర్‌, బెంగళూరులో  రెండు రోజుల్లోనే రాఘవేంద్రరావు చిత్రీకరించారు.

చిరంజీవి 104 జ్వరం

దేవకన్యగా ఉన్న శ్రీదేవి భూలోకం చూడడానికి వచ్చినప్పుడు వచ్చే ‘అందాలలో మహోమహోదయం’ పాట చిత్రీకరించడానికి రాఘవేంద్రరావు 11 రోజులు తీసుకున్నారు. అలాగే ‘దినక్కుతా దినక్కురో’ పాట చిత్రీకరణ కోసం వాహినీ స్టూడియోలో భారీ సెట్‌ వేశారు. షూటింగ్ పూర్తికాగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాలి. కానీ అదే సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం. ఒళ్లు కాలిపోతుంది. మరోపక్క రిలీజ్‌ డేట్‌ మే 9 దగ్గరపడుతోంది. షూటింగ్‌ విషయంలో ఒక్కరోజు తేడా వచ్చినా మొత్తం తేడా వచ్చేస్తుంది. ఆ సమయంలో చిరు జ్వరంతోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. సెట్‌లోనే డాక్టర్‌ను పెట్టుకుని ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఫస్ట్‌ సాంగ్‌ ఎలా ఉండాలి?

చిరంజీవి, శ్రీదేవి కలిసి సినిమా చేస్తున్నారంటే భారీ అంచనాలు ఉంటాయి. ఇక వీరిద్దరి మధ్య వచ్చే తొలి పాట అదిరిపోవాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, చిరంజీవి మానవుడు, శ్రీదేవి దేవకన్య అని తెలిసేలా పాట కావాలని ఇళయరాజాను అడగటంతో ‘అందాలలో..’ మంచి పాట ఇచ్చారు. ఈ పాటను రాఘవేంద్రావు 11రోజుల పాటు చిత్రీకరించారు. మానస సరోవరంలో ఉన్నట్లు కనిపించేందుకు ప్రత్యేక సెట్‌ వేశారు. ఇక శ్రీదేవి తాకిన ప్రతి చోట వెలుగు వస్తుంది. తను దేవకన్య అని ప్రేక్షకుడు ఫీలయ్యేందుకు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు.

కాస్ట్యూమ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ

అసలే సోషియో ఫాంటసీ సినిమా. దీంతో ఈ చిత్రంలో నటీనటులు వినియోగించే కాస్ట్యూమ్స్‌ ప్రత్యేకంగా ఉండాలి. మరీ ముఖ్యంగా దేవకన్య పాత్ర పోషించిన శ్రీదేవి కాస్ట్యూమ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతూలుల్లా వాటిని రూపొందించారు. ఇక మానస సరోవరంలో శ్రీదేవికి రెక్కలు ఉన్నట్లు ఒక డ్రెస్‌ ఉంటుంది. దానికి సంబంధించిన మెటీరియల్‌ ఇక్కడ దొరకలేదు. దీంతో ఆ రెక్కలను సింగపూర్‌, హాంకాంగ్‌లలో డిజైన్‌ చేయించి తీసుకొచ్చారు. సెట్స్‌తో పాటు, కాస్ట్యూమ్స్‌కు ‌కూడా భారీగా ఖర్చు చేశారు.

నాగిరెడ్డి ప్రశంస మర్చిపోలేనిది

ఈ సినిమాలో అందరినీ ఆకర్షించినవి సెట్స్‌. దేవలోకం, మానస సరోవరం ఇలా ప్రతిదీ సెట్‌ వేశారు. వాహిని స్టూడియోలోని 8వ ఫ్లోర్‌  అప్పట్లో ఆసియాలోనే అతి పెద్దది. ‘ప్రేమనగర్‌’ వంటి చిత్రాల సెట్స్‌ అక్కడ వేశారు. ఆ తర్వాత నుంచి అది ఖాళీగానే ఉండేది. అశ్వనీదత్‌ ఆ ఫ్లోర్‌ను తీసుకుని ఈ సినిమా కోసం సెట్స్‌ నిర్మించారు. అదే సమయంలో ప్రముఖ దర్శక-నిర్మాత నాగిరెడ్డి అక్కడకు వచ్చి, ఆ సెట్స్‌ చూసి ఆశ్చర్యపోయారు. అశ్వనీదత్‌ను పిలిచి, ‘ఇలాంటి సెట్స్‌ చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నాయనా. నీకు అభ్యంతరం లేకపోతే, ఈ సినిమా షూటింగ్‌ అయ్యే వరకూ ఇక్కడకు వచ్చి సెట్స్‌ సూపర్‌వైజ్‌ చేస్తా’ అని అన్నారట. దీంతో అశ్వనీదత్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు.

మహాద్రష్టగా అమ్రిష్‌పూరి

అమ్రిష్‌పూరి, పేరు వినగానే ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తొచ్చేది గుండుతో ఉన్న ‘మహాద్రష్ట’ రూపమే. గంభీరమైన వాయిస్‌తో ఈ సినిమాలో ఆయన నటన అందరినీ భయపెడుతుంది. అంతకుముందు అమ్రిష్‌ పూరితో అశ్వనీదత్‌ ‘ఆఖరిపోరాటం’ చేశారు. ఈ సినిమా కోసం నాలుగు రోజులు కాల్‌షీట్‌ అడిగితే, ‘నాలుగు రోజులు ఏం సరిపోతాయి. ఎనిమిది రోజులు తీసుకోండి’ అన్నారట. అలాగే ‘జగదేక వీరుడు..’ చిత్రానికి 20రోజులకు పైగా పనిచేశారు. పైగా ఈ సినిమాకు కూడా ఆయన సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడంతో మహాద్రష్ట పాత్ర బాగా పండింది.

దేవకన్య ఉంగరాన్ని ఏం చేయాలి?

ఈ కథ మొత్తం శ్రీదేవి ఉంగరం చుట్టూనే తిరుగుతుంది. దాన్ని పోగొట్టు కోవడం వల్లే ఇంద్రజ మళ్లీ భూలోకానికి వస్తుంది. అయితే, చివరకు ఆ ఉంగరంతో దేవకన్య వెళ్లిపోయిందా? లేదా? అన్న సస్పెన్స్‌ చివరి వరకూ ఉంటుంది. దీనికి అందమైన ముగింపు ఇవ్వాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకున్నారు. ‘ఏ కారణం లేకుండా, ఎవరికీ ఉపయోగపడని దేవతకు బతకడం కన్నా, మనిషి జన్మలో ఉన్న గొప్పతనాన్ని ఆ అమ్మాయి అర్థం చేసుకున్నది కాబట్టే, ఆ ఉంగరాన్ని తీసేసి, రాజుతో ఉండటానికి నిర్ణయించుకుంటుంది. అది నా ఉద్దేశం. మరి ఉంగరాన్ని ఏం చేయాలి? పారేస్తే, చెడ్డవారికి దొరికితే చెడు చేస్తారు. అందుకే అన్నీ ఆలోచించే ఉంగాన్ని చేప మింగేలా చేశాను. అన్నీ కుదిరితే సీక్వెల్‌ తీయాలన్నది నా ఆలోచన’ అని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

తుపాను బీభత్సం

సినిమా పూర్తయింది. సెన్సారు వాళ్లు కూడా ఓకే చెప్పారు. మే9, 1990న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సరిగ్గా 8వ తేదీన తుపాను మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడును కుదిపేసింది.‘ఇటువంటి పరిస్థితుల్లో సినిమాను ఎవరు చూస్తారు? పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు’ అంటూ మాటలు వినపడ్డాయి. సినిమా ప్రింట్‌లను మద్రాసు నుంచి రైల్లో పంపిస్తే, ఆ రైలు విజయవాడలో ఆగిపోయింది. దీంతో అక్కడి నుంచి ఆ ప్రింట్‌లను లారీల్లో ఉత్తరాంధ్ర, మిగిలిన ప్రాంతాలకు పంపారు. అలా 9వ తేదీ సాయంత్రం వరకూ ప్రింట్లు థియేటర్‌లకు వెళ్తూనే ఉన్నాయి. మే 9న కొన్ని చోట్ల సినిమా విడుదలైంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ సినిమాకు వెళ్లారు.  శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌లో జనాలు ఒక వైపు సినిమా చూస్తుంటే, మరోవైపు థియేటర్‌లో వర్షపు నీటిని ఫైరింజన్‌తో తోడారట. అంతటి తుపానును కూడా తట్టుకొని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్‌గ్రీన్‌ చిత్రమైంది.

సీక్వెల్‌ ఉంటుందా?

అశేష ప్రేక్షదారణ పొందిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి సీక్వెల్‌ తీసే ఉద్దేశంతోనే ఉంగరాన్ని చేప మింగేలా చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఇప్పటికే పలుమార్లు దీనిపై చర్చలు జరిగాయి. కానీ, ముందుకు వెళ్లలేదు. అశ్వనీదత్‌ కూడా దీనిపై ఒకట్రెండుసార్లు స్పందించారు. మరి భవిష్యత్‌లో ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుందా? అందులో ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నది ప్రేక్షకులకు ఎప్పటికీ ఆసక్తి కలిగించే అంశమే. చూద్దాం.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.

 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని