104 డిగ్రీల జ్వరంతో షూటింగ్‌లో చిరు
close
Published : 08/05/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

104 డిగ్రీల జ్వరంతో షూటింగ్‌లో చిరు

హైదరాబాద్‌: తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌, ఓ మైలురాయిగా చెప్పుకునే బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ సినిమా విడుదలై శనివారానికి 30 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మూడు ఆసక్తికర విషయాలను నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రత్యేక వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకుంటోంది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. మంగళవారం ఓ విశేషాన్ని వెల్లడించిన నాని.. తాజాగా సినిమాలోని పాటలకు సంబంధించి మరో కొత్త విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఈ అద్భుతమైన చిత్రం వెనుక ఎంతోమంది విజేతలు ఉన్నారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను మ్యాజికల్‌గా చూపించిన డీఓపీ విల్సన్‌‌, అందమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం, ఎడిటింగ్‌ స్కిల్స్‌తో మెప్పించిన చంటి, మాటలు, పాటలతో ఆశ్చర్యపరిచిన వేటూరి, జంద్యాల.. వీళ్లందరి కష్టానికి ప్రాణం పోసిన ఒకే ఒక్క లెజెండ్‌.. మ్యాస్ట్రో ఇళయరాజా. ప్రతిపాట వెనుక కొన్ని ఆసక్తికర కథలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆసక్తికరమైన కథ మీకోసం..’ 

‘‘జగదేక వీరుడు...’ సినిమాలోని ఒక పాట ట్యూన్‌ను ఇళయరాజా కంపోజ్‌ చేశారు. అయితే ఆ పాట విని సినిమాలో అన్నీ మెలోడి, క్లాస్‌ సాంగ్స్‌ అయిపోతున్నాయి. చిరు-శ్రీదేవి అంటే ప్రేక్షకులు మాస్‌ సాంగ్‌ కోరుకుంటారు కదా..!! అని గట్టిగానే అభ్యంతరం వచ్చింది. దీంతో రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. కానీ అశ్వనీదత్‌కి ఇళయరాజా ట్యూన్‌ను మార్చడం ఇష్టం లేదు. ఆ సమయంలో వేటూరి ఇదే ట్యూన్‌ను మాస్‌ సాంగ్‌గా మారుస్తాను చూడండి అన్నారు. అలా.. ‘అబ్బని తీయని దెబ్బ’ రాశారు. క్లాస్‌ ట్యూన్‌ని తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద మాస్‌ ట్యూన్‌గా మార్చారు ఆ ఇద్దరు లెజెండ్స్‌.. వాళ్లే వేటూరి, ఇళయరాజా. ఈ పాటను మైసూర్‌, బెంగళూరులో రెండు రోజుల్లోనే రాఘవేంద్రరావు చిత్రీకరించారు.’

‘దేవకన్యగా ఉన్న శ్రీదేవి భూలోకం చూడడానికి వచ్చినప్పుడు వచ్చే ‘అందాలలో మహోమహోదయం’ పాట చిత్రీకరించడానికి రాఘవేంద్రరావు 11 రోజులు తీసుకున్నారు. అలాగే ‘దినక్కుతా దినక్కురో’ పాట చిత్రీకరణ కోసం వాహినీ స్టూడియోలో భారీ సెట్‌ వేశారు. షూటింగ్ పూర్తికాగానే శ్రీదేవి హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాలి. కానీ అదే సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం. ఒళ్లు కాలిపోతుంది. మరోపక్క రిలీజ్‌ డేట్‌ మే 9 దగ్గరపడుతోంది. షూటింగ్‌ విషయంలో ఒక్కరోజు తేడా వచ్చినా మొత్తం తేడా వచ్చేస్తుంది. ఆ సమయంలో చిరు జ్వరంతోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. సెట్‌లోనే డాక్టర్‌ను పెట్టుకుని ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంఘటనను నిర్మాత అశ్వనీదత్‌ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. అనుకున్న తేదీకే ఆ సినిమా విడుదల చేశామంటే దానికి కారణం చిరుకి వృత్తిపట్ల ఉన్న అంకితభావమే అని ఆయన అంటుంటారు.’ అని నాని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించి 30 ఏళ్ల క్రితం మే 9న ఏమైందో నాని రేపు వెల్లడించనున్నారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని