సరోజ్‌ఖాన్‌ నృత్యాలకు శ్రీదేవి అభినయం..
close
Published : 04/07/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరోజ్‌ఖాన్‌ నృత్యాలకు శ్రీదేవి అభినయం..

కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. కానీ కొందరు తారలు మాత్రమే ఆమె నృత్యాన్ని తెరపై ప్రదర్శించి ఆమెకు పేరు తెచ్చిపెట్టడంతో పాటూ, నటనలోనే కాదు డాన్స్‌లోనూ అదరగొడతామని చాటి చెప్పారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి గురించి. సరోజ్‌ ఖాన్‌ కంపోజ్‌ చేసిన నృత్యాలను శ్రీదేవి తెరపై ప్రదర్శిస్తుంటే ప్రేక్షకులు కన్నులపండువగా తిలకించేవారు. సరోజ్‌ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేసి, శ్రీదేవి అభినయంతో వచ్చిన పాటల్లో చాలామటుకు బ్లాక్‌బాస్టర్‌ హిట్‌. ఆ పాటలేవో ఒకసారి చూద్దాం.

మే తేరి దుష్మన్‌..

1986లో విడుదలైన ‘నగీనా’లో ‘మే తేరి దుష్మన్‌’ అంటూ సాగే పాటకు సరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఇందులో శ్రీదేవి నాగుపాములా మెలికలు తిరుగూతూ డ్యాన్స్‌ చేశారు. అమ్రిష్‌పురి బూర ఊదుతూ శ్రీదేవిని రెచ్చగొడుతుండగా.. ఆగ్రహంతో ఆమె చేసే డ్యాన్స్‌ కనువిందుగా ఉంటుంది. నిజంగా నాగుపామే డ్యాన్స్‌ చేస్తుందా అనేలా సరోజ్‌ఖాన్‌ ఈ పాటకు నృత్యరీతుల్ని రూపొందించారు.  


హవా హవాయ్‌

1987లో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం మిస్టర్‌ ఇండియా. సినిమానే కాదు.. అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. అందులో ఓ పార్టీలో వచ్చే ‘హవా‌ హవాయ్‌’ పాటలో శ్రీదేవి చేసే డ్యాన్స్‌ను సరోజ్‌ఖానే కంపోజ్‌ చేశారు. బంగారు రంగు డ్రెస్‌లో శ్రీదేవి అందంగా కనిపించడంతోపాటు ఆద్యంతం తన డ్యాన్స్‌తో మైమరిపిస్తుంది.


కాటే నహి కట్‌తె ఎ దిన్‌ ఎ రాత్‌ 

‘మిస్టర్‌ ఇండియా’లో పాట ‘కాటే నహి కట్‌తె ఎ దిన్ ఎ రాత్‌‌’. ఈ పాటను అనిల్‌ కపూర్‌, శ్రీదేవి మధ్య రొమాంటిక్‌గా తెరకెక్కించారు. పాట మొత్తం శ్రీదేవి ఒకే చీరలో కనిపించినా ఆమె శృంగారభరిత హావభావాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఆ క్రెడిట్‌ అంతా కూడా కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌దేనని చెప్పాలి. 1987లో ‘మిస్టర్‌ ఇండియా’ విడుదలైంది.


న జానే కహా సే ఆయీ హై 

డాన్సర్‌గా శ్రీదేవిని మరో మెట్టు ఎక్కించిన పాట ఇది. ఓ వీధి సెట్‌లో వర్షంలో శ్రీదేవి ఎంత ఎనర్జిటిక్‌గా ఈ డాన్స్‌ చేశారో మాటల్లో చెప్పలేం. 1989లో విడుదలైన ‘చాల్‌బాజ్’లోనిది ఈ పాట. ఇందులో వర్షంలో తడుస్తూ శ్రీదేవి చేసిన అల్లరితో కూడిన డ్యాన్స్‌కు క్లాప్స్‌ కొట్టాల్సిందే. ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేసినందుకు గానూ సరోజ్‌ఖాన్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు దక్కింది. 


చాందినీ ఓ మెరి చాందినీ  

1989లో విడుదలైన ‘చాందిని’లో టైటిల్‌ సాంగ్‌ ‘చాందినీ ఓ మెరి చాందినీ’ పాట అప్పట్లో ఆల్‌టైం హిట్‌. రిషి కపూర్‌, శ్రీదేవి మధ్య సాగే ఈ రొమాంటిక్‌ పాటకు నృత్యరీతులను సరోజ్‌ఖానే కంపోజ్‌ చేశారు. ఇందులోని మరో పాట ‘మేరీ హాతో మే’ పాటలో కూడా శ్రీదేవితో చక్కటి డ్యాన్స్‌ చేయించారు సరోజ్‌ఖాన్‌.


మోర్ని -

1991లో వచ్చిన ‘లమ్హే’లో మోర్నీ పాట రాజస్థాన్‌ ఎడారిలో రాత్రివేళ చిత్రీకరించారు. ఈ పాటలో శ్రీదేవి లంగావోణీలో ఎంతో అందంగా కనిపిస్తుంది. భావోద్వేగాలను పలికిస్తూనే.. చక్కటి నృత్యం చేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని