-
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబయి ధారవిలో ఇంటింటికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో కేసులు విపరీతంగా ప్రబలినా.. అధికారులు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు.
-
అమెరికాలో అతిశీతల వాతావారణానికి చాలా సరస్సులు గడ్డకట్టుకుపోయాయి. అందులో చిక్కుకుపోయిన తాబేళ్లను టెక్సాస్‌కు చెందిన కొందరు సముద్ర పరిశోధకులు ఇటీవల సురక్షితంగా కాపాడారు. వాటికి అవసరమైన వైద్య సహాయం అందించి తిరిగి ఇవాళ సముద్ర గర్భంలోకి వదిలిపెట్టారు. ఆ ప్రాణుల మనుగడను అనుక్షణం గమనించేందుకు కొన్నింటికి శాటిలైట్ ట్యాగ్‌లను కూడా అమర్చారు.
-
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేక కానుక అందించారు నందమూరి బాలకృష్ణ. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో తాను భీష్ముడి వేషం ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా అప్పట్లో భీష్మ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించారని గుర్తు చేసుకున్నారు. నిడివి తగ్గించాల్సి రావడంతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో తన భీష్మాచార్య పాత్ర ప్రేక్షకుల ముందుకు రాలేదని బాలయ్య వివరించారు.
-
అంతర్వేది సముద్ర తీరంలో ఓ చిన్నారి విష సర్పాన్ని అలవోకగా పట్టి ఆడిస్తున్న చిత్రమిది. చిన్నారి విన్యాసాన్ని సముద్రస్నానం ఆచరించేందుకు వచ్చిన వారు ఆసక్తిగా చూశారు.
-
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భీష్మ ఏకాదశి విశిష్టత తెలిసేలా ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన కటౌట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనివేటి మండపం వద్ద సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవారు, పరమేశ్వరులను తీర్చిదిద్దారు.
-
అంతర్వేది లక్ష్మీనారసింహస్వామి కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం రాత్రి కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు నేడు నిర్వహించనున్న రథోత్సవం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆటవిడుపుగా పక్కనున్న సముద్రంలో కుటుంబంతో సహా స్నానాలు ఆచరిస్తుండటంతో ఆ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది.
-
అమెరికాలో శీతల గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోయి ఘనీభవించిన నయాగరా జలపాతం
-
కొవిడ్ మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, ఆమె భర్త డగ్లస్ ఎంహాఫ్ శ్వేతసౌధంలో నివాళులర్పించారు.
-
చెన్నై నుంచి పింగాణీ సామగ్రితో కడపకు వస్తున్న లారీలో గువ్వల చెరువు వద్దకు రాగానే ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ లారీని ఆపేసి కిందకు దిగారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీతోపాటు లోపల ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ.20లక్షల నష్టం వాటిల్లింది.
-
మహేశ్వరం మండలం గల్లూరుకు చెందిన ఓ రైతు ఫాంహౌస్‌లో పచ్చని పూలతో విరబూసిన ఈ చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది.
-
శంషాబాద్ రహదారిపై ఓ దుకాణదారుడు కొనుగోలుదారుల్ని ఆకర్షించేందుకు హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన పాత్ర హల్క్ బొమ్మను ఏర్పాటు చేశాడు.
-
కొంగలు, ఇతర పక్షులు వ్యవసాయ పొలాల్లో క్రిమి, కీటకాల వేట కోసం సంచరించడం సహజమే. అయితే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొప్పులపల్లి, హస్తాల్పూర్ శివారుల్లో మాత్రం వరి పొలాల్లో కొంగలు ఇలా గట్లపై వరుసగా ఇలా కీటకాల కోసం నిరీక్షించడం అందరినీ ఆకట్టుకుంది. శుభకార్యాల్లో అతిథులు భోజనానికి సహ పంక్తిలో కూర్చున్నట్లు ఇలా అవి వరుసగా ఉండడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు.
-
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిరుపయోగ ఇనుప వస్తువులతో ఎస్వీయూ ఎదురుగా ఉన్న ఈ-సేవ కార్యాలయం ఆవరణలో మయూరం, గద్ద నమూనాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తయారుచేశారు. వీటిని తిరుపతి నగరంలోని ఎమ్మార్‌పల్లి కూడలిలో ఏర్పాటు చేయనున్నారు.
-
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. స్థానికంగా సానిపాపగా పిలిచే ఈ చేప సముద్రంలో లోతైన ప్రాంతంలో ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. వివిధ రంగుల్లో అందంగా కనిపించడంతో దీనిని సానిపాపగా పిలుస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది 2 కేజీల వరకు పెరుగుతుందని తెలిపారు. అరుదుగా లభించే ఈ చేప రుచిగానూ ఉంటుందన్నారు.
-
వారాంతపు సంతలపై ఆధారపడి జీవించే వలస జీవుల కష్టాలకు నిదర్శనం ఈ చిత్రం. నగరంలో ఎక్కడెక్కడ సంతలు జరుగుతాయో తెలుసుకొని అక్కడికి కుటుంబసమేతంగా ఇలా తరలివెళుతుంటారు. సామగ్రితో సహా ఒకే బండిపై బాలానగర్‌కు వెళుతుండగా తీసిన చిత్రమిది.
-
పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ పనిచేసేందుకు ఒడిశా, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తారు. పిల్లలు తల్లిదండ్రులతో ఉంటూ బడికి దూరమవుతున్నారు. వర్క్‌సైట్ పాఠశాలలు ప్రారంభిస్తే చిన్నారులు అక్షరాలు నేర్చుకోనున్నారు. కరీంనగర్ నగర శివారు ప్రాంతంలో కనిపించిన దృశ్యమిది.
-
కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ప్రారంభం సందర్భంగా సోమవారం రాత్రి గండదీపాలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
-
ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు చావుపిట్ట (బరన్ఓల్)గా పిలుస్తారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన దీని కూతలు భయంకరంగా, కర్కశమైన, బుసకొట్టినట్లు ఉంటాయి. పగలు సేదదీరుతూ.. రాత్రివేళ మాత్రమే ఆహారం కోసం సంచరిస్తుంది. శిథిల భవనాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. కొల్లేరులో ఈ బుల్లి పిట్ట అటవీశాఖ అధికారుల కంటపడింది. దీని వింతైన ఆకారం పర్యాటకులను ఆకట్టుకుంది.
-
అంతర్వేది దివ్యక్షేత్రంలో లక్ష్మీనారసింహస్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల శిరస్సులపై సుముహూర్త సమయాన జీలకర్ర, బెల్లం ఉంచిన అద్వితీయమైన దృశ్యాన్ని అంతా నయనానందకరంగా వీక్షించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాలకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, డీఎస్పీ మాధవరెడ్డి కల్యాణాన్ని తిలకించారు.
-
ఎన్నికల తర్వాత పెట్టెల్లో భద్రంగా ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బంజరగూడెం పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సర్పంచి, వార్డు సభ్యులకు చెందిన ఈ బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తే.. తొండిపాక పంచాయతీకి చెందిన 13వ నంబరు పోలింగ్ స్టేషన్లో 6వ బూత్‌కు సంబంధించినవిగా తేలింది.
-
వీరంతా కవలలు. ఒకేచోట కలిసి ఆడి పాడి.. సందడి చేశారు. ‘ట్విన్స్ డే’ పురస్కరించుకొని సోమవారం విశాఖలోని ఓ హోటల్లో 25 జతల కవలలు కలిశారు. వీరందరూ ఓ వాట్సప్ గ్రూపులో ఉండటం వల్ల అంతా కలవాలనుకొని ఒకచోట చేరారు.
-
జమ్మూలోని నార్వాల్ బైపాస్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురైన కారు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపైకి ఎక్కి ఇలా కనిపించింది.
-
సూరత్‌లో సోమవారం జరిగిన ఓ జ్యువెలరీ ప్రదర్శనలో ఆకట్టుకున్న పార్లమెంట్, జాతీయ పక్షి నెమలి, కరెన్సీ చిహ్నాలతో రూపొందించిన కిరీటం.