ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
close
 • నల్గొండ జిల్లా అనుముల మండలం కుపాస్‌పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మె ధ్వంసం కావడంతో కింద పడకుండా కర్ర సాయంతో నిలబెట్టిన దృశ్యం. ప్రమాదం జరగకముందే విద్యుత్‌ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
 • తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రధాన కూడళ్లలో కర్ఫ్యూ అమలును పోలీసులు డ్రోన్‌తో పర్యవేక్షించారు. గురువారం పేపర్‌మిల్లు కూడలిలో కనిపించిన దృశ్యమిది.
 • ఒడిశా రాష్ట్రంలో లలిత కళా అకాడమీ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పట్టాచిత్ర (సంప్రదాయ పద్ధతిలో పౌరాణిక చిత్రాలు వేసే కళ) శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 150 కళాకారుల కుటుంబాలు పాల్గొన్నాయి. అక్కడి హెరిటేజ్‌ విలేజ్‌ రాఘవాపుర్‌లో పలువురు తమ ఇళ్ల ముందు చిత్రాలు వేస్తూ కనిపించారు. ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ వీటిని ట్విటర్‌లో పంచుకున్నారు.
 • కరోనా నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ ఆవరణలోని గూడ్స్‌షెడ్డు సమీపంలో పట్టాలపై రైలుబండిని నిలిపారు. నెలల తరబడి నిలిపి ఉంచడంతో దాని చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. నిర్వహణ నిమిత్తం ప్రతిరోజూ రైలింజన్‌ను ఆన్‌ చేసి మరలా ఆపేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
 • కర్ఫ్యూ నేపథ్యంలో మామిడిపండ్ల వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. సకాలంలో ఎగుమతులు సాగకపోవడం, సరైన ధర లభించక, పండ్లను నిల్వచేసే సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో రైతులు తెచ్చిన పండ్లను రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఇలా పారబోశారు. వాటిని పశువులు తింటుండగా తీసిన చిత్రమిది.
 • బ్రిటన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ ‘బ్రిటిష్‌ ఆసియన్‌ ట్రస్టు’ ప్రతినిధులతో కలిసి సైకిల్‌ సవారీ చేశారు. ట్రస్టు నిర్వహించిన ‘ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇలా సందడి చేశారు.
 • అమెరికాలోని న్యూయార్క్‌తో పాటు పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కారణంగా గురువారం సూర్యుడు చీకటితో దోబూచులాడుతూ ఇలా కనిపించాడు.
 • వరంగల్‌లో నూతనంగా పునరుద్ధరించిన ప్రాంతీయ గ్రంథాలయం ఇలా అబ్బురపరిచే చిత్రాలతో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేసి గ్రంథాలయ పునరుద్ధరణలో జీడబ్ల్యూఎంసీ పనితీరును అభినందించారు.
 • ముంబయిలో భారీ వర్షాలతో ఓ మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. చాలా మంది తమ గూడు చెదిరిపోవడంతో కన్నీరుమున్నీరవుతూ విలపించారు.
 • ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబు తన కూతురు సితార, కుమారుడు గౌతమ్‌లతో కొన్నేళ్ల క్రితం దిగిన ఫొటోను నమ్రత తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. కొవిడ్‌ లేని రోజుల్లో.. కాలగమనంలో రివైండ్‌ చేసి వెనక్కి వెళ్తే ఇలా ఉంటుంది అని పోస్టు చేశారు.
 • ఆర్మీ దుస్తులు ధరించినట్లుగా ఉన్న ఈ సీతాకోక చిలుక గచ్చిబౌలిలోని జనార్దన హిల్స్‌లో కనిపించింది.
 • నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గురువారం తిరుమల అఖిలాండం వద్ద అభిమానులు 101 కొబ్బరి కాయలు, 5 కిలోల కర్పూరంతో పూజలు నిర్వహించారు. తెదేపా రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
 • నందమూరి బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య కేక్‌ కోసి పంచిపెట్టారు. అక్కడి సిబ్బంది, చికిత్స పొందుతున్న చిన్నారులతో కలిసి సందడి చేశారు.
 • కళ్లమీద తీవ్ర ప్రభావం చూపి నయనాలు తొలగించే స్థితికి తీసుకెళ్లే బ్లాక్‌ఫంగస్‌ వైరస్‌ తగ్గుముఖం పట్టింది. నోడల్‌ కేంద్రంగా ప్రకటించిన కోఠి ఈఎన్‌టీ ఆసుప్రతిలో బుధవారం పడకలు కనుచూపు మేర ఖాళీగా ఉండడమే నిదర్శనం.
 • చిత్రంలో కనిపిస్తున్న వారంతా చేయి చాచింది ఆహారం కోసం కాదు.. బుధవారం ఓ వ్యక్తి నిలోఫర్‌ ఆసుపత్రి వద్ద మాస్కులు పంచుతుండగా ఇలా ఎగబడ్డారు. చివరకు చేతిలో డబ్బానే లాక్కున్నారు.
 • కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన పిల్లలు తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. క్యాతనపల్లి నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఓ వ్యాపారి కూరగాయలను అమ్ముతుంటారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఇలా తండ్రికి తోడుగా నిలుస్తోంది.
 • రెండు రోజులుగా దాతలు రాకపోవడంతో ఉన్న ఆహారాన్ని తాము పొదుపుగా తింటుంటే దాన్ని దొంగిలించబోయాడని.. ఓ వ్యక్తిని కిందపడేసి దాడి చేస్తున్న దృశ్యమిది. చాదర్‌ఘాట్‌లో బుధవారం కనిపించిందీ దయనీయ దృశ్యం.
 • ఈ చిత్రంలో చెట్టుకింద కూర్చున్న గిరిజన మహిళ పేరు పెనుబల్లి చిన్నక్క. మద్దులమడకు చెందిన ఈమెకు ఇటీవల కొవిడ్‌ సోకింది. ఆమె ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో ఇంటికి దూరంగా పొలంలో ఉన్న చెట్టు కిందనే ఆమె ఉంటున్నారు. తన వల్ల తమ ఇంట్లో ఉన్న వారు కరోనా బారిన పడకూడదనే ఇలా చెట్టుకిందనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు చిన్నక్క తెలిపారు.
 • కరోనా కష్ట కాలంలో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ ఎందరో పేదలకు సాయమందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా మహబూబాబాద్‌కు చెందిన చిత్రకారుడు రాజు వినూత్నంగా సోనూసూద్‌ చిత్రాన్ని రూపొందించారు. సోనూసూద్‌ నటించిన సినిమాల పేర్లతో ఆయన బొమ్మ గీశారు.
 • మణుగూరు మండలం పెద్దపల్లిలో సుమారు 70కుటుంబాలున్నాయి. వీరిలో 60కుటుంబాలు చరవాణీలు వాడుతున్నారు. కానీ, మారుమూలన ఉన్న ఈ గ్రామంలో విద్యుత్తు సౌకర్యం లేదు. రాత్రిపూట గ్రామంలో వెలుగులు నింపేందుకు సింగరేణి ఆధ్వర్యంలో అక్కడక్కడా సౌరదీపాలు పెట్టారు. ఇళ్లల్లో మాత్రం అంధకారమే. దీంతో చరవాణీలకు ఛార్జింగ్‌ పెట్టేందుకు అవకాశం లేదు. చరవాణీలను కొన్నవారంతా సోలార్‌ను కొనుగోలు చేసి ఛార్జింగ్‌ పెట్టుకుంటున్నారు. సుమారు రూ.1200 నుంచి రూ.1600 వరకు ఖర్చు చేసి... వీటిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటింటిపై సౌరఫలకం కన్పిస్తోంది.
 • లాక్‌డౌన్‌ వేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న ఓ విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. పెట్రోల్‌ వాడకం తగ్గితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో సొంతంగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేసుకున్నారు. కొత్త సైకిల్‌ అయితే రూ.19 వేలు అవుతుందని, పాతసైకిల్‌కే పరికరాలు అమర్చడంతో రూ. 13,500తో ఎలక్ట్రిక్‌ సైకిల్‌ సిద్ధమైందని చెబుతున్నారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింతకు చెందిన మణికంఠ. ఇంటి అవసరాలకు నాన్న, తమ్ముడు వినియోగిస్తున్నారని ఆనందంగా చెబుతున్నారు.
 • తలపై బరువున్నా ఎందుకీ చిన్నారి ఆనందపడుతోంది అనుకుంటున్నారా? అయితే చదవండి. ఈ బాలిక ఊరికెళ్లేందుకు కుటుంబంతో కలిసి బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. దాతలు ఆహారం పంచుతుండడంతో ఉరుకున వెళ్లి ఓ డబ్బా దక్కించుకొంది. నిండుగా భోజనం ఉండడంతో కుటుంబమందరికీ తిండి దొరికిందన్న సంతోషంతో ఆ చిన్నారి ఇలా మనసారా నవ్వింది.
 • వికారాబాద్‌ అనంతగిరి అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తున్న పర్యటకులు ప్లాస్టిక్‌ నీటి సీసాలను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. వీటిని వికారాబాద్‌లో నివాసం ఉంటున్న రాహుల్‌ సేకరించి కిలోకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. బుధవారం ‘ఈనాడు’ ఆయనను పలకరించగా పాత సామాన్లు సేకరించి ఉపాధి పొందుతున్నానని తెలిపారు. కొన్నేళ్లుగా ఉదయాన్నే అనంతగిరికి వచ్చి సీసాలు సేకరిస్తున్నానని, ఇలా చేయడం వల్ల తనకు ఉపాధితోపాటు, అడవిలో వన్యప్రాణులను కాపాడుతున్నానన్న సంతృప్తి కలుగుతోందని వివరించారు.
 • మహమ్మారి వేర్వేరు దశల్లో వేర్వేరు విధాలుగా ప్రభావితం చూపుతోంది. కరోనా ఏరూపు దాలుస్తున్నా రూపుమాపడంలో టీకాలు దీటుగా వ్యవహరిస్తుండడంతో వ్యాక్సినేషన్‌కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఓ కేంద్రం కిటకిటలాడింది. సూది వల్ల తాత్కాలిక నొప్పి కలిగినా భద్రత దృష్ట్యా తప్పదని పలువురు యువతులు పేర్కొన్నారు.
 • శ్రీవారు కొలువైన శేషాచల కొండలు ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చదనం సంతరించుకున్నాయి. బుధవారం మధ్యాహ్న సమయంలో కొండలపై భానుడి వెలుగు.. తిరుపతిపై ఏర్పడిన నీడ దృశ్యం ఆకట్టుకుంది. ఈ సుందర చిత్రాన్ని భక్తులు తిలకించి ఆనందించారు. -ఈనాడు, తిరుపతి
 • గుంటూరు అమరావతి రోడ్డులోని విద్యుత్తు స్తంభం వద్ద ఓ కార్మికుడు చేతులకు గ్లౌజులు లేకుండా తమ వాహనంపై నిచ్చెన వేసుకుని అజాగ్రత్తగా అంతర్జాల తీగను సరి చేస్తున్నాడు. పైన విద్యుత్తు తీగలు, కింద కదిలే వాహనం ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలమీదకే వస్తుంది. - ఈనాడు, గుంటూరు
 • మధ్యాహ్నం 12 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉండడంతో 11.30 గంటలకే పనులు ముగించుకొని రోడ్లపైకి ఇలా ఒక్కసారిగా వాహనచోదకులు వచ్చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. 11.50 గంటలకు ఎంజీ రోడ్డులో కనిపించిన దృశ్యమిది. - ఈనాడు, విజయవాడ
 • ఇనుప వస్తువులను వాహనాల్లో తరలించేటప్పుడు వెనుక వచ్చే వాహనదారులకు ప్రమాదమని అర్థమయ్యేలా ఎర్రటి వస్త్రం కట్టాలి. ఇక్కడ చూడండి ఇనుప చువ్వలు తరలించే లారీ నుంచి ఒక చువ్వ బయటకు చొచ్చుకొచ్చింది. వెనుక వచ్చే వాహనదారులు గమనించకపోతే తల లోపలికి దిగిపోయే ప్రమాదముంది. విజయవాడ మహానాడు రోడ్డు పక్కన కనిపించిన దృశ్యమిది. - ఈనాడు, విజయవాడ
 • సాధారణంగా రెండు సర్పాలు సయ్యాట ఆడుతూ కనిపిస్తుంటాయి. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని కాటికోటేశ్వర క్షేత్రానికి వెళ్లే దారిలో బధవారం మూడు సర్పాలు సయ్యాట ఆడుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను ఆసక్తిగా తిలకించి, చరవాణుల్లో చిత్రీకరించారు. -న్యూస్‌టుడే, తాడిమర్రి
 • విశాఖ నగరంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వరుణుడు కరుణించాడు. అప్పడి వరకూ వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు కొంత ఉపశమనం పొందారు. దాదాపు అరగంటపాటు కురిసిన వర్షంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. వర్షం కురుస్తున్న సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను చిత్రంలో చూడొచ్చు. - ఈనాడు, విశాఖపట్నం
 • ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఎండీయూ వాహనాలు మన్యంలో తరచూ మొరాయిస్తున్నాయి. హుకుంపేట మండలం జర్రకొండ, చీకుమద్దెల, గన్నేరుపుట్టు గ్రామాలకు బుధవారం బియ్యం నిల్వలతో బయలుదేరిన వాహనం దారిలో ఆగిపోయింది. గిరిజనులు కొంతదూరం నెట్టినా.. మొండికేయడంతో జీపునకు కట్టి షెడ్డుకు తరలించారు. గిరిజన గ్రామాలు కొండలపై ఉండటం, ఆయా గ్రామాలకు వాహనాలు చేరుకోలేక తరచూ ఇంజిన్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువగా క్లచ్‌ ప్లేట్లు కాలిపోతున్నాయని వాహన సిబ్బంది పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, హుకుంపేట
 • నాడు-నేడు పెయింటింగ్‌ పనుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కస్తూర్బా విద్యాలయం, తిక్కవరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇటీవల ‘నాడు-నేడు’ పనుల్లో భాగంగా పెయిటింగ్‌ వేశారు. ఇందుకు సుమారు రూ. నాలుగు లక్షల వరకు వెచ్చించారు. కానీ, వేసిన నెలకే రంగులు ఊడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఒక కోటింగ్‌తో సరిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, మర్రిపాడు
 • గుంటూరు అమరావతి రోడ్డులో 12 గంటల తర్వాత తోపుడు బండిపై మామిడి పండ్లు విక్రయిస్తున్నాడని ఓ చిరు వ్యాపారిని బతిమాలుతున్నా వదలకుండా జీపులోకి ఎక్కిస్తున్న పోలీసులు
 • గుంటూరు నల్లపాడు వద్ద ఓ మెకానిక్‌ షెడ్డుకు అల్లుకున్న ఈ పచ్చని తీగల పందిరి వేడి నుంచి ఉపశమనం ఇస్తోంది.
 • ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఫోన్‌ నంబరు, బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో కరోనా వేళలోనూ ప్రజలు అనుసంధానం చేసుకునేందుకు, కొత్త కార్డులు తీసుకునేందుకు ఆధార్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వైరస్‌ మహమ్మారి పొంచి ఉందన్న విషయమూ మరిచిపోతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని విశాఖ గ్రామీణ బ్యాంకులోని ఆధార్‌ కేంద్రం వద్దకు బుధవారం పెద్దఎత్తున ప్రజలు వచ్చారు. -న్యూస్‌టుడే, సాలూరు
 • వాతావరణం చల్లబడింది.. చుట్టుపక్కల మనుషుల సంచారం లేదు. వనంలోని జింకలు బయటికి వచ్చాయి. ఇటీవల జల్లులకు పెరిగిన మొలకల్ని తింటూ గంతులేశాయి. కర్నూలు జిల్లా డోన్‌ సమీపంలో ఈ హరిణాల విహారం కనువిందు చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నం వరకే రైతులు పొలం పనులు చేసుకొని ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో ఖాళీ పొలాల్లో ఎలాంటి భయం లేకుండా జింకలు కలియ తిరుగుతున్నాయి. - ఈనాడు, కర్నూలు
 • మామిడిలో ‘నాటీ’ రకం కాయలు ఒకటిన్నర కిలో బరువు ఉండటం సహజం. చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు చెందిన చాంద్‌బాషా తోటలో మాత్రం ఏకంగా 3 కిలోల బరువున్న కాయలు కాశాయి. తోట మొత్తంలో ఒకే ఒక్క చెట్టు 150 కాయలు ఇలా కాసింది. బుధవారం వీటిని బంగారుపాళ్యం మార్కెట్‌కు తీసుకొచ్చారు. స్థానిక రైతులు, వ్యాపారులు వీటిని ఆసక్తిగా తిలకించారు. రైతుకు మాత్రం ఆశించిన ధర దక్కలేదు. కిలో రూ.5 చొప్పున మాత్రమే పలికింది. కరోనా సమయంలో ఇంత కంటే ఎక్కువ చెల్లించలేమని వ్యాపారులు చెప్పడం గమనార్హం. -న్యూస్‌టుడే, బంగారుపాళ్యం
 • ఉదయం 8గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. కర్ఫ్యూ సడలింపు సమయని ఉదయం జనం తమ పనులు చేసుకునేందుకు బయటకు వస్తున్నారు. సుర్రుమనే ఎండలో ఇలా ముసుగులు ధరించి వెళ్తున్నారు. - ఈనాడు, విజయవాడ
 • కరోనా వైరస్‌ మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపనుందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేసే కార్యక్రమాన్ని బుధవారం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని బసవపున్నయ్య మైదానంలో టీకా వేయించుకునేందుకు పిల్లలతో కలిసి తల్లులు ఇలా తరలివచ్చారు. -ఈనాడు, అమరావతి
 • రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసింది. ఈ భవనాలు వర్షాల నుంచి ధాన్యం బస్తాలను తడవకుండా కాపాడుకోవడానికి సైతం ఉపయోగపడుతున్నాయి. దీనికి నిదర్శనం రంగారెడ్డి జిల్లా మంచాలలోని రైతు వేదిక భవనం.
 • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ప్రేమనగర్‌లోని రాజునాయక్‌కు చెందిన ఆవు నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దాని లేగదూడ పాలు లేక నీరసించిపోతోంది. దీంతో ఓ మేక చనుపాలను లేగదూడకు పట్టించారు. ఇలా ఆ లేగకు.. మేక అమ్మైంది.
 • భారీ వర్షాల కారణంగా జమ్మూలోని గుజ్జర్‌నగర్‌-పంజ్‌తిర్తి రహదారి కోతకు గురి కావడంతో గుంతలో పడిపోయిన కార్లు.
 • కరోనా కట్టడికి పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు కొత్తపంథాలో ప్రచారం నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటికే కరోనా వైరస్‌ను పోలిన శిరస్త్రాణం ధరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు.. తాజాగా వైరస్ నమూనా ఉన్న గదలు, సేఫ్‌గార్డులతోనూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కూడలి వద్ద ప్రజలకు కరోనా నివారణపై అవగాహన కల్పించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు